Jagan: చిన్నవాడిగా అడుగుతున్నా... 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా?: సీఎం జగన్‌

  • ఎర్రగుంట్లలో మేధావులు, ప్రజలతో జగన్ ముఖాముఖి
  • 58 నెలలుగా బటన్లు నొక్కుతూ నగదు జమ చేస్తున్నాన్న జగన్
  • ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలని వ్యాఖ్య
Jagan comments on Chandrababu

ఏ పార్టీ అని చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కుతూ నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని చెప్పారు. జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ ఉదయం ఆయన ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ఒక్క ఎర్రగుంట్లలోనే 93 శాతం మంది లబ్ధి పొందారని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని గణాంకాలతో స్వయంగా వివరించారు. తన కంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారని... తనకన్నా వయసు, అనుభవం ఎక్కువ ఉన్న వారు పని చేశారని చెప్పారు. వయసులో తాను చిన్నవాడినని... ఒక చిన్నవాడిగా అడుగుతున్నానని... 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలను మార్చిందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఎంత ఉందో అందరూ ఆలోచన చేయాలని చెప్పారు. 

గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు బాగుపడ్డాయని జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. మీ బిడ్డ పాలనలో ఏ స్థాయిలో మార్పు జరిగిందో ఆలోచించాలని అన్నారు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చే ఎన్నికలని... మన భవిష్యత్తు కోసం మంచిని చూసి ఓటు వేయాలని కోరారు.

More Telugu News